ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. “ప్రజల కోసం నిలబడితే ప్రజలు మన వెంట నిలబడతారు.. నిజం కోసం నిలబడితే నిజమే మనల్ని నిలబెడుతుంది” అనేదే తన జీవిత సిద్ధాంతమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు చేయకపోయినా రాజకీయ కక్షసాధింపుతో స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో తనను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించారని మండిపడ్డారు.
ఆనాటి రాక్షస చర్యలకు తాను ఎక్కడా భయపడలేదని, లొంగిపోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దురుద్దేశంతో తనను జైల్లో పెట్టగలిగారు కానీ తన మనోధైర్యాన్ని మాత్రం ఏమాత్రం దెబ్బతీయలేకపోయారని అన్నారు. తాను జైలులో ఉన్న క్లిష్ట సమయంలో తెలుగుజాతి మొత్తం ఏకమై రోడ్లపైకి వచ్చి పోరాడిందని, దేశవిదేశాల నుంచి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అందించిన సంఘీభావం తన జీవితంలో ఎప్పటికీ మరువలేనని కృతజ్ఞతలు తెలిపారు. ఆ కష్టకాలం ప్రజల కోసం మరింత దృఢంగా నిలబడేలా తనలో ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంచిందని వివరించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓటు రూపంలో కక్షసాధింపు రాజకీయాలకు గట్టిగా చరమగీతం పాడారని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలను తన చేతుల్లో పెట్టి ప్రజలు నిజాన్ని గెలిపించారని, అందుకు నిదర్శనమే నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘నిజం గెలిచింది’ ఉద్యమ స్ఫూర్తి అని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగుజాతిని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తన జీవిత లక్ష్యమని, ఆ సంకల్పాన్ని తప్పకుండా నిజం చేసి తీరుతానని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.









