ఝార్ఖండ్లో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో విస్మయం కలిగించే ఉదంతం వెలుగులోకి వచ్చింది. జమ్షెడ్పూర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 286 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏకంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ పౌరుల పేర్లు నమోదై ఉండటాన్ని ఎన్నికల అధికారులు గుర్తించారు. అసిల్ ఖాన్, మహ్మద్ అస్లాం, మహ్మద్ ఇబ్రహీం అనే ముగ్గురు వ్యక్తులు ఓటర్లుగా నమోదు కావడం అధికార వర్గాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపింది.
ధ్రువీకరణ ప్రక్రియలో పత్రాల్లో తేడాలు రావడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ ముగ్గురు భారత పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా వారి వద్ద ఆఫ్ఘనిస్థాన్ పాస్పోర్టులు బయటపడ్డాయి. దీంతో వారు విదేశీయులని నిర్ధారించుకున్న అధికారులు తక్షణమే ఆ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. విదేశీ పౌరులు భారత ఓటరు గుర్తింపు కార్డులు పొందేందుకు సహకరించిన స్థానికులు, బాధ్యులైన అధికారులను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కె. రవికుమార్ ఆదేశించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని జమ్షెడ్పూర్ డిప్యూటీ కమిషనర్, ఎస్పీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ ముగ్గురి కుటుంబ సభ్యుల రికార్డులను కూడా పరిశీలిస్తుండటంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా మరేదైనా ప్రాంతంలో ఇలాంటి విదేశీయుల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదయ్యాయా అనే కోణంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ముసాయిదా ప్రక్రియలో వెలుగుచూసిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.









