అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఇరాన్ కావాలని ఉద్రిక్తతలను కొనసాగిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. డల్లాస్ పర్యటనకు వెళ్లే ముందు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం దానంతట అదే సర్దుమణుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమెరికాలో తమకు లొంగి ఉండే ఒక బలహీన ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలనే కుట్రతోనే టెహ్రాన్ ఈ వివాదాన్ని సాగదీస్తోందని, ఆర్థికంగా పతనమైనప్పటికీ అణ్వాయుధాన్ని సాధించాలనే దురాశతోనే ఇరాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడానికి ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధ వాతావరణమే కారణమని ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాసోలిన్ ధరలు గణనీయంగా పతనమై, గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటాయని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి ముందే చమురు ధరలను తగ్గించడం సాధ్యం కాకపోవచ్చని, పరిస్థితులు అదుపులోకి రావడానికి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇరాన్‌తో తక్షణ శాంతి చర్చలు జరిపే ఆలోచన ప్రస్తుతానికి వైట్‌హౌస్‌కు లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. గత ఏడు నెలలుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన తొమ్మిది నౌకలను, చమురు ట్యాంకర్లను పూర్తిగా ధ్వంసం చేసి గట్టి దెబ్బ కొట్టాయని గుర్తుచేశారు. ఇరాన్ ప్రస్తుతం తీవ్ర బలహీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నందున తాము చర్చల కోసం తొందరపడటం లేదని, భవిష్యత్తులో చర్చలు జరిగితే అవి కేవలం అణు ఒప్పందానికే పరిమితం కాకుండా సమగ్ర అంశాలపైనే ఉంటాయని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.









