అక్టోబర్లో చిన్న పత్రికల భారీ ఎగ్జిబిషన్!!
– పత్రికల ఎగ్జిబిషన్ – త్రిభాషా పోటీలు
– విజేతలకు నగదు బహుమతి
– ప్రభుత్వ ప్రకటనలు, ఇంటి స్థలాలపై పోరు
– ‘చిన్న పత్రికల’ అసోసియేషన్ ప్రకటన!
చిన్న పత్రికల ఎడిటర్లు స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నారని,తమకు తాము ఉపాధి కల్పించుకుంటూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారని వారి సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ‘తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్’ (TSMNMA) రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు పిలుపునిచ్చారు.
బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యూసుఫ్ బాబు అధ్యక్షతన నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న పత్రికల నిర్వహణలో ఎడిటర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, బిల్స్ పెండింగులో ఉన్నాయని, గత కొంతకాలంగా రెగ్యులర్గా ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలను ఇవ్వడంలేదని ఆయన అన్నారు.
*అక్టోబర్లో పత్రికల ఎగ్జిబిషన్ – త్రిభాషా పోటీలు*
చిన్న పత్రికల విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు అక్టోబర్లో రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పత్రికలతో భారీ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ దినపత్రికలు, మ్యాగజైన్స్ విభాగాల్లో ప్రదర్శనలు ఉంటాయి. ప్రతి విభాగంలోనూ ఉత్తమ పత్రికలకు నగదు పురస్కారాలు,జ్ఞాపికలు, సర్టిఫికెట్స్ ఇస్తామని ప్రథమ (రూ. 10,000), ద్వితీయ (రూ. 7,000), తృతీయ (రూ. 3,000) నగదు బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు.
ఎగ్జిబిషన్లో పాల్గొనే దినపత్రికల ఎడిటర్లు దేశోద్ధరక భవన్ లోని TSMNMA కార్యాలయంలో సంప్రదించాలని కోరారు . ఈ కార్యక్రమానికి మంత్రులను, ఇరు రాష్ట్రాల సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్లను, మీడియా అకాడమీ చైర్మన్ లను ఆహ్వానించన్నట్లు వెల్లడించారు. వేదిక వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ప్రభుత్వ ప్రకటనలు, ఇంటి స్థలాలపై పోరు..
సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. గత 8 నెలలుగా చిన్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు విడుదల కాకపోవడం శోచనీయమన్నారు. ఆందోళన బాటపడితే తప్ప ప్రకటనలు ఇచ్చే పరిస్థితి లేదని, జర్నలిస్టులకు ఇంటి స్థలాల సాధనపై కూడా స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేస్తామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి ఆజం ఖాన్,రాష్ట్ర నాయకులు దాస్ మాతంగి, కె. రాజిరెడ్డి గడ్డమీది బాలరాజు,సలీం పాషా, డి. బాలకృష్ణ,గోళ్ళ రమేష్, సాజిదా సికందర్,మక్సూద్ తదితరులు పాల్గొన్నారు.









