‘సూపర్ ఎల్ నినో’పై చంద్రబాబు సమగ్ర వ్యూహం: మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం!

రాష్ట్రంపై ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో దాని దుష్ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసింది. అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై సమగ్ర సమీక్ష జరిపి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర ఎల్ నినో పరిస్థితుల్లోనూ పట్టిసీమ ద్వారా 39.5 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి లక్షలాది ఎకరాల పంటలను కాపాడగలిగామని గుర్తుచేసిన సీఎం, ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని శాశ్వతంగా కరవు రహితంగా మార్చే 36 ప్రాధాన్యతా నీటిపారుదల ప్రాజెక్టులను రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఎల్ నినో ప్రభావం వల్ల పంట దిగుబడులు తగ్గి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటకుండా మంత్రుల కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. భవిష్యత్తులో డిమాండ్ ఉండే ఉల్లి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, అవసరమైతే రాయితీ విత్తనాలు, మద్దతు ధర ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను ముందే నింపి వచ్చే వేసవి వరకు తాగునీటి కొరత రాకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క ప్రాంతంలోనూ పశుగ్రాసం, తాగునీటికి ఇబ్బంది కలగకూడదని స్పష్టం చేశారు.

పంటల బీమాపై రైతులకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, విత్తనాలు చల్లేందుకు డ్రోన్ల వినియోగాన్ని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పెద్దఎత్తున ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అనేక కీలక సాగునీటి ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, అవి పూర్తయి ఉంటే నేడు ఇంతటి విపత్కర పరిస్థితులు ఉండేవి కావని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలపై ఇకపై ప్రతి వారం స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు తాను కూడా స్వయంగా పర్యటనలు చేస్తానని అధికారులు, కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు