తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు త్వరలోనే రెండు డీఏలు (కరవు భత్యం) విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను నేరుగా వివరించారు. రాష్ట్రంలో ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, కనీసం మూడు డీఏల విడుదలకు అసెంబ్లీ సమావేశాల్లోనే ఉత్తర్వులు జారీ చేయాలని నేతలు కోరగా, ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 18వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించనున్న కీలక సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
దసరా పండుగ నాటి నుంచి రాష్ట్రంలో పీఆర్సీ (వేతన సవరణ) అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరగా, సీఎం సరదాగా స్పందిస్తూ “రంజాన్ కూడా పెద్ద పండుగే కదా” అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పీఆర్సీ కమిటీ పూర్తి నివేదిక అందిన తర్వాత సంఘాలతో ప్రత్యేకంగా చర్చించి అమలు విధివిధానాలు ఖరారు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు పెండింగ్ బిల్లుల నిమిత్తం సుమారు ₹10,000 కోట్లు విడుదల చేశామని గుర్తుచేసిన ముఖ్యమంత్రి, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఉద్యోగుల సమస్యలపై ఆర్థిక సమీక్ష జరుపుతామని, తన కార్యాలయ ద్వారాలు ఉద్యోగులకు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు.
మరోవైపు ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేస్తే ప్రభుత్వంపై ప్రతి ఏటా దాదాపు ₹6,000 కోట్ల వరకు భారం పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు సిద్ధం చేసింది. మొదటి డీఏ కింద ₹3,700 కోట్లు, రెండో డీఏ కింద ₹2,300 కోట్ల భారం పడే అవకాశం ఉండగా, వచ్చే నెల జీతాల నుంచి చెల్లించాలంటే నెలకు అదనంగా ₹500 కోట్ల వరకు అవసరమవుతాయి. ఈ అదనపు భారాన్ని భరించేందుకు నిధుల సర్దుబాటు, కొత్త రుణాల సేకరణపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. మొదటి రెండు డీఏల ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాతే మూడో డీఏపై ఆలోచన చేసే వీలుందని అధికారులు పేర్కొంటుండగా, సీఎం సానుకూల స్పందనతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.









