“22ఏ అనేది సాంకేతిక పొరపాటు కాదు.. రేవంత్ సర్కార్ చేసిన పెద్ద దుర్మార్గం!”: మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్!

తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్న నిషేధిత భూముల జాబితా (సెక్షన్-22ఏ) వివాదంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన 22ఏ బాధిత రైతులు, ప్రజల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల భూములు, ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం కేవలం రెవెన్యూ అధికారుల సాంకేతిక తప్పిదం కాదని, సామాన్యుల భూములను కాజేసే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేసిన ఘోరమైన దుర్మార్గమని ఆరోపించారు. ఎన్నికల ముందు ‘భూ భారతి’ అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులకు ‘భూ హారతి’ పడుతోందని ఆయన ఘాటుగా ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజా సమస్యలను పరిష్కరించడం మానేసి, కేవలం భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల చుట్టూనే పరిభ్రమిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల విలువైన పాలిటెక్నిక్ కళాశాలల భూములను కాజేయడానికే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని, కానీ క్షేత్రస్థాయిలో బాధితులు నేరుగా వెళ్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసినా పైసా ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు. మరోవైపు హైడ్రా (HYDRAA) పేరుతో నిరుపేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్న పాలకులు.. బడా నాయకులు, బడా బాబుల అక్రమ కట్టడాల జోలికి మాత్రం కనీసం వెళ్లడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మొత్తం వ్యవహారానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నైతిక బాధ్యత వహించి తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉన్న స్థలాన్ని రాత్రికి రాత్రే 22ఏ నిషేధిత జాబితా నుంచి దర్జాగా తొలగించుకున్న ప్రభుత్వం.. అదే జాబితాలో చిక్కుకుని రిజిస్ట్రేషన్లు కాక, కష్టార్జితం అమ్ముకోలేక నరకయాతన అనుభవిస్తున్న సామాన్య ప్రజల భూములను ఎందుకు తొలగించడం లేదని సూటిగా ప్రశ్నించారు. తక్షణమే పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులను 22ఏ జాబితా నుంచి బేషరతుగా తొలగించాలని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు బీఆర్‌ఎస్ పార్టీ రాజీలేని న్యాయ, ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు