“అసెంబ్లీ గేటు వద్ద కౌరవసభను తలపించేలా దాడి!”: సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే పోలీసుల దాష్టీకం అంటూ జాతీయ మహిళా కమిషన్‌కు సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు!

తెలంగాణ శాసనసభ ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన అమానుష తీరుపై ఆమె జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్‌పర్సన్ విజయ కిశోరి రహత్కర్‌తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ప్రతినిధులను కలిసి అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి.. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభ ముఖద్వారం వద్ద జరిగిన ఈ దారుణ ఘటనలు దేశంలో ఎక్కడా లేనివిధంగా, నాటి మహాభారత కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని తలపించేలా సాగాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న తమను శాసనసభ లోపలికి వెళ్లకుండా పోలీసులు దుర్మార్గంగా అడ్డుకున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కనీసం మహిళా ప్రజాప్రతినిధులమన్న గౌరవం కూడా లేకుండా జుట్టు పట్టుకుని లాగారని, చీరలు లాగి అవమానించారని, పురుష ఎమ్మెల్యేలను కిందపడేసి బూట్లతో తొక్కేశారని మండిపడ్డారు. ఈ తోపులాటలోనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గుర్తుచేశారు. ఈ భౌతిక దాడులన్నీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ఆదేశాలు, ఆయన వేసిన డైరెక్షన్‌తోనే పక్కా పథకం ప్రకారం జరిగాయని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోగా.. తమపైనే ఎదురు కేసులు బనాయించడం, మాజీ సీఎం కేసీఆర్ నివాసం వద్దకు ఆందోళనకారులను పంపడం ప్రభుత్వ కుట్రలను స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.

ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా కానిస్టేబుళ్లను అడ్డుపెట్టుకుని ‘శిఖండి రాజకీయాలు’ చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. వంద రోజుల్లో ఇస్తామన్న హామీలను నెరవేర్చడంలో విఫలమైన సర్కార్.. సెక్షన్-22ఏ పేరుతో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి భారీ భూదందాలకు తెరలేపిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా శాసనసభ్యులకే రక్షణ, న్యాయం కరువైనందునే తాము ఢిల్లీకి వచ్చి జాతీయ కమిషన్లను ఆశ్రయించాల్సి వచ్చిందని, ఇది తెలంగాణ ప్రభుత్వానికి తీరని సిగ్గుచేటని పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన ఈ దాష్టీకానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు పూర్తి ఆధారాలతో లేఖలు రాస్తున్నామని, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు