కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కీలకమైన సమాచారాన్ని అందించింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (SSC CGL 2026) టైర్-1 పరీక్షల అధికారిక తేదీలను కమిషన్ ఖరారు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. వివిధ తేదీల్లో, పలు షిఫ్టుల వారీగా పరీక్షలు నిర్వహించనుండటంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మరింత ముమ్మరం చేసుకోవాలని సూచించారు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలు, ప్రధాన విభాగాలు, అనుబంధ సంస్థల్లో అత్యంత కీలకమైన గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది నోటిఫికేషన్లో మొత్తం 12,256 ఖాళీలను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర పోటీ పడుతున్నారు. టైర్-1 పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. చివరి దశలో కొత్త అంశాలపై దృష్టి సారించడం కంటే సిలబస్ రివిజన్, మాక్ టెస్టులు రాయడం, పాత ప్రశ్నపత్రాల సాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిగత పరీక్ష తేదీ, నిర్దిష్ట షిఫ్ట్, పరీక్షా కేంద్రం, అడ్మిట్ కార్డుల వివరాలను ఎస్ఎస్సీ త్వరలోనే వేర్వేరుగా అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు తమ ప్రాంతీయ ఎస్ఎస్సీ అధికారిక పోర్టల్తో పాటు ప్రధాన వెబ్సైట్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి అనధికారిక ప్రచారాలను నమ్మవద్దని, కేవలం ఎస్ఎస్సీ విడుదల చేసే అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. పరీక్షలకు ఇంకా స్వల్ప సమయమే మిగిలి ఉండటంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.









