అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు: మంత్రీ కాస్మోస్‌లో గేట్ల ధ్వంసం.. ఆక్రమణ యత్నంపై పోలీసులకు సీసీటీవీ ఆధారాలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ, రాజకీయ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి గచ్చిబౌలి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ‘మంత్రీ కాస్మోస్’ గేటెడ్ కమ్యూనిటీ భవన ప్రాంగణంలో స్థలం ఆక్రమణకు యత్నించారనే ఆరోపణలపై ఆయనతో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా, అటు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఉదయం వేళ కొందరు వ్యక్తులు ముఠాగా వచ్చి ప్రాంగణంలోని సౌత్‌వెస్ట్ కార్నర్ ఎంట్రన్స్ గేట్ తాళాలు బలవంతంగా పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. అక్కడ ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, స్థలాన్ని ఆక్రమించేందుకు హడావుడిగా టిన్‌షీట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. ఈ దురాక్రమణను అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిని నెట్టివేసి, భౌతిక దాడికి దిగుతూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని అసోసియేషన్ పేర్కొంది. అత్యవసర సమయాల్లో ఫైర్ ఇంజిన్లు, నీటి ట్యాంకర్లు రాకపోకలు సాగించే కీలక మార్గాన్ని ఆక్రమించడం వల్ల వేలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అక్రమ చొరబాటు, దౌర్జన్య కాండకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఫొటో ఆధారాలను బాధితులు పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచి పోలీసులకు సమర్పించారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులకు, నివాసితులకు భద్రత కల్పించాలని కోరుతూ గచ్చిబౌలి పోలీసులతో పాటు తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదు ప్రతులను అందజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు