ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణను పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మొత్తం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటుతున్నాయని, ప్రభుత్వం విడుదల చేసిన 1065, 105 జీవోలను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిల్ పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలను విన్న అనంతరం తన తుది తీర్పును రిజర్వ్ చేసింది.
విచారణ సందర్భంగా రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రభుత్వ తీరును ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ను ఏర్పాటు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటని నిలదీస్తూ, ఆ నియామక ఉత్తర్వులను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 34 శాతం రిజర్వేషన్లను సిఫారసు చేయడానికి కమిషన్ ఎలాంటి అధ్యయనం చేసింది, అందుకు పరిగణనలోకి తీసుకున్న గణాంకాలు ఏమిటనే వివరాలు ఇవ్వాలని కోరింది. కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను తామే స్వయంగా పరిశీలిస్తామని, గతంలో ప్రణాళికా విభాగం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా రికార్డుల్లో ఉంచాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం అందించే అన్ని నివేదికలు, అధికారిక గణాంకాలు, సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గతంలో విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితి నిబంధన నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఇవ్వబోయే తుది తీర్పు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హైకోర్టు వెలువరించే తీర్పుపైనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అమలు ఆధారపడి ఉండటంతో రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.









