ఇది ఎల్ నినో కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్: చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు.. ఎకరాకు రూ.25 వేల పరిహారానికి డిమాండ్!

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్నది కేవలం ప్రకృతిసిద్ధమైన ‘ఎల్ నినో’ ప్రభావం మాత్రమే కాదని, చంద్రబాబు నాయుడి అసమర్థత, నిర్లక్ష్యంతో కూడిన “ఎల్లో నినో” ప్రభావమని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరిలోనే ఎల్ నినో హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడం వల్లే ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రాష్ట్రంలో 51 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైందని ఆరోపించారు.

రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో దాదాపు 628 మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని, అందులో 332 మండలాలు తీవ్ర వర్షాభావంతో అల్లాడిపోతున్నాయని జగన్ వెల్లడించారు. సుమారు 20 లక్షల ఎకరాల్లో సాగు నిలిచిపోయి భూములన్నీ బీడుగా మారాయని, వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఇంతటి విపత్కర పరిస్థితులు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా కరవు మండలాలను ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు.

పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని జగన్ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25,000 చొప్పున తక్షణ నష్టపరిహారం చెల్లించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావ పరిస్థితులను గాలికొదిలేసి రైతుల గోడును పట్టించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని వైఎస్ జగన్ హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు