ఇండోనేషియా తీరానికి చేరిన ఇటలీ యుద్ధనౌక: నౌకాదళంలో తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్.. భారీ నిర్వహణ ఖర్చులపై విమర్శలు!

ఇండోనేషియా నౌకాదళ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశపు మొట్టమొదటి విమాన వాహక నౌకగా ఇటలీకి చెందిన ‘ఐటీఎస్ గిసెప్పే గారిబాల్డి’ ఉత్తర జకార్తాలోని తాంజుంగ్ ప్రియోక్ నౌకాశ్రయానికి చేరుకుంది. 41 ఏళ్ల నాటి ఈ యుద్ధనౌకను ఇటలీ ప్రభుత్వం ఇండోనేషియాకు ఉచిత గ్రాంట్‌గా అందించగా, దేశీయ యుద్ధనౌకలు ఘనంగా స్వాగతం పలికాయి. రక్షణ మంత్రి స్జాఫ్రీ స్జామ్‌సోద్దీన్, త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో నేవల్ ఏవియేషన్ విమానాల విన్యాసాల నడుమ అధికారికంగా ఆహ్వానం పలికారు.

ఆగస్టు 24న ఇటలీ నుంచి బయలుదేరిన ఈ నౌక, సెప్టెంబర్ 25న ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమక్షంలో ‘కేఆర్ఐ శ్రీవిజయ’ పేరుతో అధికారికంగా నౌకాదళంలో చేరనుంది. సైనిక పోరాటాల కంటే ఎక్కువగా విపత్తు సహాయక చర్యలు, మానవతా దృక్పథంతో కూడిన సహాయ కార్యక్రమాలు, హెలికాప్టర్ల ద్వారా కార్చిచ్చులను అదుపు చేసేందుకు ఈ నౌకను వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, నాలుగు దశాబ్దాల నాటి పాత నౌకను తీసుకురావడంపై దేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీని ఆధునికీకరణ, నిర్వహణ కోసం రక్షణ శాఖ సుమారు 7.2 ట్రిలియన్ రుపియాలు ఖర్చవుతుందని భావిస్తుండగా, మొత్తం వ్యయం 16 ట్రిలియన్లకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ ప్రజాధనాన్ని వెచ్చించి పాత నౌకను రిపేర్ చేసుకోవడం కన్నా, సరికొత్త అత్యాధునిక యుద్ధనౌకలను సమకూర్చుకోవడం ఎంతో ప్రయోజనకరమని పలువురు రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు