ఏపీ ప్రజలకు భారీ ఊరట: రెసిడెన్స్ ప్రూఫ్‌గా రేషన్ కార్డు, ఆధార్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్స్ ప్రూఫ్, రెసిడెన్స్ సర్టిఫికెట్ల వినియోగానికి సంబంధించి అత్యంత కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ప్రత్యేకంగా నివాస ధ్రువీకరణ పత్రం (Residence Certificate) తీసుకోవాల్సిన అవసరం లేకుండా రేషన్ కార్డు, ఆధార్‌లను నివాస రుజువుగా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన నిబంధనలను సవరిస్తూ ప్రజలకు ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా సులభతర సేవలు అందించే లక్ష్యంతో ఈ కొత్త జీవోను విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు కూడా రెసిడెన్స్ ప్రూఫ్‌గా రేషన్ కార్డు, ఆధార్ కార్డులను సమర్పించవచ్చని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అయితే మిలిటరీ, రక్షణ దళాల రిక్రూట్‌మెంట్లు మరియు కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ప్రత్యేకంగా నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయని పేర్కొంది. ఒకవేళ అభ్యర్థులు ఇప్పటికే ఈ పత్రాలు పొంది ఉంటే, వాటిని మళ్లీ కొత్తగా జారీ చేయించుకోవాల్సిన పనిలేదని ప్రభుత్వం వివరించింది.

మరోవైపు నివాస ధ్రువీకరణ పత్రాల జారీ బాధ్యతను ప్రభుత్వం తిరిగి తహసీల్దార్లకే అప్పగించింది. సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలన అనంతరం పత్రాలు జారీ చేస్తారని, ఎలాంటి ఆధారాలు లేని పక్షంలో తహసీల్దార్ స్వయంగా స్థానిక విచారణ చేపట్టి నివాసాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. నివాస ధ్రువీకరణ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పడంతో ప్రభుత్వ తాజా నిర్ణయంపై సామాన్య ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు