ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం-2 పథకానికి సంబంధించి సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తూ ప్రభుత్వం ఏటా రూ.2,900 కోట్లు వెచ్చిస్తోంది. అయితే ప్రస్తుతం లబ్ధిదారులు ముందుగా సొంత డబ్బులతో సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ తీసుకున్న తర్వాత రాయితీ సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతోంది. ఈ క్రమంలో డబ్బులు ఎప్పుడు పడుతున్నాయో సమాచారం లేక పలువురు లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు.
ఈ సమస్యను అధిగమించడానికి ఇతర సంక్షేమ పథకాల మాదిరిగానే ఇకపై ప్రతి నెలా ఒక నిర్ణీత తేదీని ఖరారు చేసి, నేరుగా అదే రోజున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాయితీ డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉదాహరణకు ఒక నెలలో సిలిండర్ డెలివరీ తీసుకున్న వినియోగదారులకు మరుసటి నెలలో నిర్దిష్ట తేదీన రాయితీ ఖాతాకు చేరేలా మార్పులు చేయనున్నారు. ఈ ప్రతిపాదనపై పౌరసరఫరాల శాఖ, ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే అంతర్గత చర్చలు పూర్తి చేశారు.
‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ తరహాలోనే ముందుగానే అధికారికంగా తేదీని ప్రకటించి నిధులు విడుదల చేయడం వల్ల లబ్ధిదారులకు పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఒకటికంటే ఎక్కువ ఖాతాలు ఉన్న వినియోగదారులకు కూడా సరైన అవగాహన ఏర్పడుతుందని, త్వరలోనే రాయితీ నిధుల విడుదలకు సంబంధించిన నిర్దిష్ట తేదీపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.









