తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ 20 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో కూడా పలుచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భారీ వర్షాల సూచనతో పాటు గణేశ్ నిమజ్జన ఊరేగింపులు ఉండటంతో సైబరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు ఐటీ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇవ్వాలని, అలాగే విద్యాసంస్థలు వర్చువల్ లేదా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రతిపాదించారు. నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఐటీ కంపెనీలు, పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
రాష్ట్రంలో ఈ సీజన్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ వర్షాలు రైతులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశముంది. సెప్టెంబర్ మధ్య నాటికి సాధారణం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో అనేక జిల్లాల్లో చెరువులు, ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు కురిసే వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.









