ఆంధ్రప్రదేశ్ ముంపు మండలాల్లో కోర్టులను ఏర్పాటు చేయండి…

ఆంధ్రప్రదేశ్ ముంపు మండలాల్లో కోర్టులను ఏర్పాటు చేయండి….. అమరావతి హైకోర్టు జడ్జీలను కలిసి విజ్ఞప్తి చేసిన భద్రాచలం బార్ అసోసియేషన్..

భద్రాచలం, సెప్టెంబర్ 18: TODAY 9…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న పోలవరం ముంపు మండలాల ప్రజలకు రాజ్యాంగబద్ధమైన న్యాయ సేవలను మరింత చేరువ చేసే ఉద్దేశంతో, పోలవరం జిల్లాలోని ఎటపాక లేదా చింతూరు కేంద్రంగా అదేవిధంగా ఏలూరు జిల్లాలోని కుక్కునూరు కేంద్రంగా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (JFCM) కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రతినిధులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  న్యాయమూర్తులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

.

ఈ కోర్టుల ఏర్పాటు సాధనలో భాగంగా శుక్రవారం అమరావతి హైకోర్టు న్యాయమూర్తులతో భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందానికి అపాయింట్‌మెంట్ ఖరారైన నేపథ్యంలో, వారు హైకోర్టు న్యాయమూర్తులను కలిసి చర్చించారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి  జస్టిస్ శ్రీ జయసూర్య , ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్  కొనకంటి శ్రీనివాసరెడ్డిని, హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ ఎన్. హరినాథ్ లను కలిసి ముంపు ప్రాంతాల గిరిజన, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన న్యాయపరమైన, రవాణా ఇబ్బందులను బృందం వివరించింది.

పోలవరం జిల్లా రంపచోడవరం కోర్టు పరిధిలోని చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల ప్రజలు దాదాపు 160 కిలోమీటర్లకు పైగా దట్టమైన అటవీ ప్రాంతం, ప్రమాదకరమైన ఘాట్ రోడ్లలో రాకపోకలు సాగిస్తూ తీవ్రమైన ఆర్థిక, శారీరక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జడ్జీల దృష్టికి తీసుకెళ్లారు. ఇది ఇలా ఉండగా , పోలవరం జిల్లా పరిధిలోని ఎటపాక లేదా చింతూరు కేంద్రంగా శాశ్వత జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఏర్పాటు చేయాలని, అప్పటివరకు వారానికి రెండుసార్లు క్యాంపు కోర్టు నిర్వహించాలని కోరారు .
అదేవిధంగా, ఏలూరు జిల్లా పరిధిలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి కుక్కునూరు నుండి జంగారెడ్డిగూడెం కోర్టుకు సుమారు 90 నుంచి 130 కి.మీ దూర ప్రయాణం చేయాల్సి వస్తోందని తెలిపారు. ఈ ప్రాంతంలో సివిల్, ఎక్సైజ్, ఫారెస్ట్, మెయింటెనెన్స్, DVC, ఎన్.ఐ. యాక్ట్ కేసులు కలిపి మొత్తం 900 పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నందున, ప్రజల సౌలభ్యం కోసం ఏలూరు జిల్లా, కుక్కునూరు కేంద్రంగా క్యాంపు కోర్టును ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్‌ను హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ ఎన్. హరినాథ్  శాలువాతో సన్మానించారు .

ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీ తాత లలిత, లైబ్రరీ సెక్రటరీ పడాల కవిత, లేడీ రిప్రజెంటేటివ్ ఎం. తరుణి, సీనియర్ న్యాయవాదులు రావి రామ్మోహన్, పేరాల వెంకటేశ్వర్లు, ముత్యాల కిషోర్, పేరాల నాగరాజు, కే అరుణశ్రీ, కాపుల ప్రకాష్, పోకల మోహనకృష్ణ, పామరాజు తిరుమలరావు, అవులూరి సత్యనారాయణ, ఎస్. నర్మద, ఎం.వి రమ, పాపినేని రామాశ, తానికొండ వాసు, బి.రామకృష్ణ, వలవల సురేష్ కుమార్, విజ్జగిరి రవితేజ, కొత్తపల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు