అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ భద్రతకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించే ప్రకటన చేశారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలతో కలిసి అమెరికా ఒక చారిత్రక శాశ్వత భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్లాండ్ రక్షణ, వ్యూహాత్మక అవసరాలపై అమెరికాకు పూర్తి శాశ్వత నియంత్రణ లభిస్తుందని పేర్కొన్నారు. గత వందేళ్లుగా అమెరికా అధ్యక్షులు ఎవరూ పరిష్కరించలేకపోయిన ఈ కీలక అంశాన్ని శాశ్వతంగా పరిష్కరించడం తనకు ఎంతో గర్వంగా ఉందని, అమెరికా ప్రజల చిరకాల కల నిజమైన క్షణమిదని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్లాండ్లో అమెరికాకు ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదని, భద్రతా రక్షణ కోసం అమెరికా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ తెలిపారు. అలాగే అమెరికా లిఖితపూర్వక అనుమతి లేకుండా మరే ఇతర దేశం కూడా గ్రీన్లాండ్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం గానీ, ఆర్థిక పెట్టుబడులు పెట్టడం గానీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. త్వరలోనే స్థానిక ప్రజల సహకారంతో గ్రీన్లాండ్లోని అత్యంత అనువైన వ్యూహాత్మక ప్రాంతంలో అమెరికా ఒక భారీ సైనిక కేంద్రాన్ని (Military Base) ఏర్పాటు చేసే పనులను వెంటనే ప్రారంభిస్తుందని ప్రకటించారు.
మరోవైపు ఇదే మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మరో తీవ్ర సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎన్ఎన్ (CNN), ఎంఎస్ఎన్ఓడబ్ల్యూ (MSNOW), పొలిటికో (Politico) వంటి అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు వైట్హౌస్లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని, అందుకే ఈ కఠిన చర్య తీసుకున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే ఇలాంటి బహిష్కరణ వేటు తప్పదని ఆయన గట్టిగా హెచ్చరించారు.









