తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తూ కీలక నిందితుడిని కటకటాల్లోకి నెట్టింది. సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను హైదరాబాద్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనను అదుపులోకి తీసుకున్న అనంతరం విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో భారీ ఎత్తున కల్తీ జరిగిందంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆర్థిక మూలాలపై విచారణ ప్రారంభించింది. నిందితులు పామాయిల్, పామోలిన్ మరియు వివిధ రసాయనాలను కలిపి ప్రమాదకర నకిలీ నెయ్యిని తయారు చేసి, దానిని ‘అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి’ పేరిట టీటీడీకి విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో మొత్తం రూ. 230 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని దేవస్థానానికి సరఫరా చేయగా, అందులో ఏకంగా రూ. 96 కోట్ల విలువైన నెయ్యిని కైలాష్ చంద్ తన సొంత ఫ్యాక్టరీలోనే ఉత్పత్తి చేసినట్లు ఆధారాలతో సహా అధికారులు గుర్తించారు.
ఈ భారీ కుంభకోణంలో కైలాష్ చంద్ సహ కుట్రదారుడిగా వ్యవహరిస్తూ శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి సంస్థల పేర్లతో కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. తాము నిజమైన ఆవు నెయ్యినే తయారు చేసినట్లు రికార్డులను సైతం తారుమారు చేసి నకిలీ పత్రాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇదే కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న విపిన్ జైన్ను అరెస్ట్ చేసిన ఈడీ, తాజా అరెస్టుతో ఈ నెయ్యి కల్తీ దందా వెనుక ఉన్న మరింత మంది కీలక వ్యక్తులు, అక్రమ లావాదేవీలపై ఉచ్చు బిగిస్తోంది.









