తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన అర్హులైన పేదలకు గృహ నిర్మాణ బోర్డు (టీజీహెచ్బీ) భారీ ఊరటనిచ్చింది. లబ్ధిదారులకు నేటి (సోమవారం) నుంచే అధికారిక అలాట్మెంట్ పత్రాలను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా ఈ కేటాయింపు పత్రాలను పంపుతున్నామని, టీజీహెచ్బీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా నేరుగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాయదుర్గంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో అత్యాధునిక వసతులతో 480 ఫ్లాట్లను నిర్మించనున్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.50 లక్షల విలువ చేసే ఒక్కో ఫ్లాట్ను అర్హులైన పేదలకు కేవలం రూ.6 లక్షలకే ప్రభుత్వం అందించనుండటం విశేషం.
హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 21 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపైనా మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా లక్కీ డ్రా నిర్వహించి పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, హౌసింగ్ కాలనీలకు 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అక్టోబర్ చివరి నాటికి నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించిన మంత్రి.. కేటాయించిన ఇళ్లలో నివసించకుండా ఖాళీగా ఉంచిన వారి కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన కొత్త పేదలకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు.









