ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని కోస్గి జూనియర్ కాలేజీ మైదానంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2009 ఎన్నికల ప్రచారంలో కోస్గి వేదికగా తనతో పాటు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్రెడ్డి పాల్గొన్నారని ఆమె గుర్తుచేశారు. ఆ సభ తర్వాత వారిద్దరూ కాలక్రమంలో ముఖ్యమంత్రులు అయ్యారని, ఆనాడు ప్రచారంలో పాల్గొన్న మూడో వ్యక్తినైన తనకు కూడా కోస్గి కాలేజీ సెంటిమెంట్తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజల ఆశీస్సులు దక్కితే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తూ తాను కాబోయే సీఎం అన్న సంకేతాలు ఇచ్చారు.
తనపై ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలకు కవిత ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్ నేతలు తనను కాంగ్రెస్ విడిచిన బాణమని, సీఎం రేవంత్రెడ్డి తనను కేసీఆర్ వదిలిన బాణమని, మరికొందరు బీజేపీ బాణమని విమర్శిస్తున్నారని ప్రస్తావిస్తూ.. తాను ఎవరి బాణాన్ని కాదని, తెలంగాణ బహుజనుల బాణాన్ని అని గట్టిగా ప్రకటించారు. రాజకీయ అండదండలు లేకపోయినా ఒక మహిళగా ఆత్మగౌరవంతో బహుజనులు, యువత హక్కుల కోసం నిలబడతానని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు ఉంటే ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్లలో ఎవరితోనైనా రాజీలేని పోరాటానికి సిద్ధమని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా గాలికొదిలేసిందని కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాగునీరు, యూరియా, ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాంతంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, విద్య మరియు వైద్య రంగాలకు భారీగా నిధులు కేటాయించి ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యులకు చేరువ చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్, కోస్గి సభల విజయవంతం తర్వాత తమ రాజకీయ విస్తరణలో భాగంగా తదుపరి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు.









