అమెరికాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరాన్ ఒకవైపు దౌత్య మార్గాన్ని ఎంచుకుంటూనే, మరోవైపు వాషింగ్టన్కు కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. సంపూర్ణ యుద్ధాన్ని నివారించి శాంతి చర్చలు ప్రారంభించాలంటే తాము విధించిన ఏడు కీలక షరతులను అమెరికా బేషరతుగా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అధికారికంగా తమ షరతుల జాబితాను పంపించినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసెన్ రెజాయీ వెల్లడించారు. తాము విధించిన నిబంధనలకు అంగీకరించని పక్షంలో ‘నిర్ణయాత్మక యుద్ధానికి’ సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఇరాన్ పెట్టిన ప్రధాన డిమాండ్లలో అన్ని రంగాల్లో యుద్ధ చర్యలను తక్షణమే నిలిపివేయడం, అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేసిన తమ దేశ ఆర్థిక నిధులను బేషరతుగా విడుదల చేయడం, నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. తాము ఎలాంటి సైనిక బెదిరింపులకు లొంగేది లేదని, తమ షరతులను ఆమోదించడమే అమెరికాకు శ్రేయస్కరమని మొహసెన్ రెజాయీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఖతార్ రాయబార కార్యాలయం ద్వారా పంపిన ఈ డిమాండ్లపై వైట్‌హౌస్ మరియు అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చే అధికారిక స్పందన కోసం వేచిచూస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఒకవైపు శాంతి చర్చల ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు ఇరాన్ తన సైనిక సన్నద్ధతను ఊహించని రీతిలో పెంచింది. అమెరికా మళ్లీ సైనిక దాడులకు దిగే అవకాశముందన్న నిఘా వర్గాల అంచనాతో గల్ఫ్ మరియు అరేబియా సముద్రంలోని అమెరికా నౌకాదళ ఆస్తులే టార్గెట్‌గా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఒకేసారి పలు లక్ష్యాలను గురిచూసి ధ్వంసం చేయగల అత్యాధునిక ‘మల్టీ-వార్‌హెడ్ యాంటీ-షిప్ క్షిపణి’ని విజయవంతంగా పరీక్షించినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతానికి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి తప్పుకోలేదని, అయితే అమెరికా అనుసరించే దూకుడు వైఖరే భవిష్యత్తు అణు విధానాలను నిర్దేశిస్తుందని తెగేసి చెప్పింది.
Post Views: 14









