ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు వరుపుల సుబ్బారావు వైసీపీకి గుడ్బై చెప్పి అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. జనసేన ముఖ్య నేతల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్న నేపథ్యంలో, సుబ్బారావు వంటి సీనియర్ నేత పార్టీని వీడటం స్థానిక వైసీపీ శ్రేణులపై, క్షేత్రస్థాయి క్యాడర్ మనోధైర్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జనసేన పార్టీలో చేరిన అనంతరం వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుసరించిన నిర్ణయాలు, ముఖ్యంగా పేదలకు చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ పథకం తీవ్ర లోపభూయిష్టంగా సాగిందని ఆయన ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను, స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లే పార్టీ ప్రజలకు దూరమై తీవ్రంగా నష్టపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని సుబ్బారావు స్పష్టం చేశారు. పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ.. స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని ఆయన వెల్లడించారు.









