సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో సంచలనం: కృష్ణలంక సీఐ సహా ఏడుగురిపై కోర్టులో సిట్ చార్జ్‌షీట్ దాఖలు!

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన గాదె సాయికృష్ణ (25) అనుమానాస్పద కస్టడీ మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ముందడుగు వేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజును ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంటూ, మరో ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం ఏడుగురిపై సిట్ సోమవారం విజయవాడ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం, లాకప్‌లో చిత్రహింసలకు గురిచేసి చంపడం, అనంతరం సాక్ష్యాలు దొరకకుండా మృతదేహాన్ని శ్మశానవాటికలో రహస్యంగా దహనం చేయడం వంటి తీవ్రమైన అంశాలను సిట్ అధికారులు పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.

నిందితుల్లో ఒకడైన గులివిందల సురేశ్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. మే 12న రాణిగారి తోటలోని ఓ ప్రైవేట్ ఇంట్లో పోలీసులు రోజూ తీవ్రంగా కొడుతున్నారంటూ సాయికృష్ణ దయనీయ స్థితిలో తన వద్ద వాపోయాడని, మాట్లాడుతుండగానే కుప్పకూలి ప్రాణాలు విడిచాడని సురేశ్ వెల్లడించాడు. ఆ తర్వాత సీఐ నాగరాజు ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుళ్లు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి బైక్‌పై స్వర్గపురి శ్మశానవాటికకు తరలించి దహనం చేశారని విచారణలో తేలింది. సాక్ష్యాలు ఏమైనా మిగిలాయా అని నిర్ధారించుకోవడానికి మే 18న సీఐ స్వయంగా మళ్లీ శ్మశానానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.

అంతేకాకుండా, ఈ ఘోరం బయటకు రాకుండా ఉండేందుకు సీఐ నాగరాజు మృతుడి కుటుంబసభ్యులను డబ్బుతో కొనుగోలు చేసి కేసును రాజీ చేసేందుకు యత్నించినట్లు సిట్ ధ్రువీకరించింది. మృతుడి తల్లి విజయలక్ష్మి న్యాయపోరాటం, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రభుత్వం ఐజీ ఎం. రవిప్రకాశ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై సర్వత్రా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా, ఈ చార్జ్‌షీట్‌తో నిందితులందరికీ చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు వేగవంతమయ్యాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు