కొడుకు పేరును అధికారికంగా ప్రకటించిన నారా రోహిత్: బాబుకు ‘నందన్ రామ నారా’ అని నామకరణం.. నెట్టింట పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్ ఇంట్లో నూతన సంతోషం వెల్లివిరిసింది. ఇటీవల తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆయన, తన ముద్దుల కుమారుడికి నామకరణం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ బాబుకు ‘నందన్ రామ నారా’ అని పేరు పెట్టినట్లు అధికారికంగా వెల్లడిస్తూ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు. “ప్రేమ, కృతజ్ఞత, అంతులేని ఆనందంతో నిండిన హృదయాలతో మా అబ్బాయిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం.. మా చిన్నారి నందన్‌కు స్వాగతం, నువ్వే మాకు దక్కిన అతిపెద్ద ఆశీర్వాదం” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తన కుమారుడి పేరు వెనుక ఉన్న విశిష్టతను కూడా రోహిత్ వివరించారు. ‘నందన్’ అంటే అంతులేని సంతోషాన్ని, ఆనందాన్ని పంచేవాడని.. అలాగే తన తాతగారి జ్ఞాపకార్థం ఆయన పేరులోని ‘రామ’ను ఎంతో గౌరవంతో, ప్రేమతో జతచేసినట్లు పేర్కొన్నారు. నారా రోహిత్, నటి శిరీష దంపతులకు ఈ ఏడాది జూన్ 23న పండంటి మగబిడ్డ జన్మించగా, ఇప్పుడు బాబు పేరును అధికారికంగా ప్రకటించడంతో నారా కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన నారా రోహిత్, కెరీర్ పరంగానూ మంచి జోరు మీదున్నారు. గతంలో ‘సుందరకాండ’ చిత్రంతో ఆకట్టుకున్న ఆయన, ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, దీనితో పాటు సోలో హీరోగా మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టి వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు