ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ, టెలివిజన్ రంగాల కళాకారులు, సాంకేతిక నిపుణులకు భారీ శుభవార్త అందించింది. పుష్కర కాలంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నంది అవార్డుల నిర్వహణకు అధికారికంగా అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో (G.O.Rt.No.1843) జారీ చేసింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్న పురస్కారాలతో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన నంది అవార్డులను కూడా ఒకేసారి ప్రదానం చేసేందుకు కూటమి సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్, బుల్లితెర రంగాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న నిరీక్షణకు తెరపడింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అవార్డుల ప్రదానోత్సవాల షెడ్యూల్, వేదికలను ఖరారు చేశారు. గతంలోనే ప్రకటన పూర్తయిన 2012 నుంచి 2016 వరకు గల నంది మరియు జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకను 2026 నవంబర్లో విజయవాడలో నిర్వహించనున్నారు. ఇక 2017–2024 మధ్య కాలానికి సంబంధించి ప్రతి ఏటా కేవలం నాలుగు అవార్డులు (మొదటి, రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్లు, రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులు) మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కాలానికి అలాగే 2025 సంవత్సరానికి సంబంధించిన ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిసెంబర్లో అమరావతి లేదా విజయవాడలో నిర్వహించనుండగా, నంది టీవీ అవార్డుల వేడుకను ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డుల పునరుద్ధరణపై ఏపీ ఎఫ్డీసీ (APSFTVTDC) ఛైర్మన్ పి. భరత్ భూషణ్, సినీ వర్గాలు తీవ్ర హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణల చొరవతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. నంది అవార్డుల పునఃప్రారంభంతో పాటు సినీ పరిశ్రమకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నట్లు అధికారులు వెల్లడించడంతో టాలీవుడ్ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.









