కర్ణాటకలో ‘వందేమాతరం’ వివాదం: రెండు చరణాలకే పరిమితం చేయొద్దు.. కాంగ్రెస్ సర్కార్‌కు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ హెచ్చరిక!

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త ఉత్తర్వులు ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ, రాజ్యాంగపరమైన దుమారానికి దారితీశాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం ‘వందేమాతరం’ను కేవలం మొదటి రెండు చరణాలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసిన గవర్నర్.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు, జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ ఉత్తర్వులను వెంటనే పునఃపరిశీలించాలని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 8న కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి లేదా గవర్నర్ పాల్గొనే అత్యున్నత స్థాయి కార్యక్రమాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వ వేడుకల్లో ‘వందేమాతరం’ మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిబంధన విధించారు. అయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ గేయం సమగ్ర రూపానికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ప్రొటోకాల్ జారీ చేసిందని గవర్నర్ గుర్తుచేశారు. పార్లమెంట్ ఆమోదించిన నిబంధనల ప్రకారం జాతీయ చిహ్నాలు, గేయాల రూపురేఖలను కుదించే అధికారం రాష్ట్రాలకు ఉండదని, రాష్ట్ర ఉత్తర్వులు కేంద్ర చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని లేఖలో ఎత్తిచూపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 162, 256, 257(1) ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలకు, కేంద్ర అధికారిక నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయని గవర్నర్ గుర్తుచేశారు. ఈ తరహా ఏకపక్ష నిర్ణయాలు కేంద్ర-రాష్ట్రాల మధ్య అనవసరమైన ఘర్షణలకు, కోర్టు వివాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వివాదాస్పదమైన సెప్టెంబర్ 8 నాటి ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తి జాతీయ గేయ ప్రొటోకాల్‌ను పాటించాలని ఆయన ప్రభుత్వానికి గట్టిగా సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు