కపూర్ ఫ్యామిలీలో మరో శుభకార్యం.. చట్టబద్ధంగా భార్యాభర్తలైన ఆదర్ జైన్-అలేఖ అద్వానీ!

బాలీవుడ్ ప్రముఖ కపూర్ కుటుంబంలో మరో వేడుక ఘనంగా పూర్తయింది. లెజెండరీ నటుడు రాజ్ కపూర్ కుమార్తె రీమా జైన్ కుమారుడు, యువ నటుడు ఆదర్ జైన్ తన ప్రియురాలు అలేఖ అద్వానీతో చట్టబద్ధంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా రిజిస్టర్ చేయించుకుంది. ఈ ప్రత్యేక ఘట్టానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. “ట్రయల్ పీరియడ్ ముగిసింది, ఇకపై రిటర్న్స్, ఎక్స్ఛేంజ్‌లు ఉండవు! గణపతి బప్పా ఆశీస్సులతో అధికారికంగా మిస్టర్ అండ్ మిసెస్ జైన్‌గా మారాము” అంటూ సరదా క్యాప్షన్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఆదర్ తల్లి రీమా జైన్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఆదర్ జైన్, అలేఖ అద్వానీల సాంప్రదాయ వివాహం 2025 ఫిబ్రవరిలోనే ఘనంగా జరగ్గా, తాజాగా లీగల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లాంఛనాలను పూర్తి చేసుకున్నారు. సెప్టెంబర్ 2023లో ఓ సుందరమైన సముద్ర తీరంలో అలేఖకు ఆదర్ ప్రపోజ్ చేయగా, అదే ఏడాది నవంబర్‌లో తమ ప్రేమ బంధాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. గతంలో నటి తారా సుతారియాతో బ్రేకప్ అనంతరం అలేఖతో ప్రేమలో పడ్డ ఆదర్, ఇరు కుటుంబాల అంగీకారంతో ఏడడుగుల బంధంలోకి ప్రవేశించారు.

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆదర్ జైన్.. కరణ్ జోహార్ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2017లో వచ్చిన ‘ఖైదీ బ్యాండ్’ చిత్రంతో కథానాయకుడిగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అనంతరం ‘హలో చార్లీ’, ‘ఖేల్ ఖేల్ మే’ వంటి విభిన్న చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చట్టబద్ధంగా ఒక్కటైన ఈ నూతన దంపతులకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు