ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కూటమి ప్రభుత్వం మరో భారీ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నప్పటికీ యాజమాన్య హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న 24,042 మంది పేదలకు శాశ్వత పట్టాలు మంజూరు చేయబోతోంది. ఈ నెల 30న విజయవాడ అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు ఈ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. గతంలో విశాఖపట్నంలో 28 వేల మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు అందించిన ప్రభుత్వం, ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పేదలకు భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలోని 15 మండలాలు, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలాల పరిధిలో సుమారు 616.53 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించారు. ప్రభుత్వ విలువ ప్రకారం ఈ భూముల విలువ రూ. 9,798 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్ విలువ ఏకంగా రూ. 24,497 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 8,140 మందికి, పశ్చిమ నియోజకవర్గంలో 6,790 మందికి, సెంట్రల్ నియోజకవర్గంలో 6,325 మందికి విలువైన స్థలాల పట్టాలు అందనున్నాయి. విజయవాడ నగరంలో గజం రూ. 50 వేల వరకు పలికే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని భూములను సైతం నిరుపేదలకు సొంతం చేస్తుండటం విశేషం.
ఈ పట్టాల మంజూరులో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 12,084 మంది బీసీలు, 6,124 మంది ఓసీలు, 4,546 మంది ఎస్సీలు, 955 మంది ముస్లిం మైనారిటీలు మరియు 333 మంది ఎస్టీ వర్గాల వారు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదల ఇళ్లతో పాటు, సెక్షన్ 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో చిక్కుకుపోయిన స్థలాలను సైతం ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ నిర్ణయంతో పేదలకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు రావడమే కాకుండా, భవిష్యత్తులో వాటిపై బ్యాంక్ రుణాలు పొందేందుకు మార్గం సుగమమైంది.









