న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అణచివేతపై తిరుగుబాటు, ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడిన ఆయన.. చిత్ర బృందంతో పాటు కీలకమైన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్రను పోషించిన నటుడు ప్రియదర్శి నటనను ప్రత్యేకంగా అభినందించారు. చిత్రంలో భావోద్వేగాలు, నటీనటుల ప్రదర్శన అత్యున్నత స్థాయిలో ఉన్నాయంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ సినీ, రాజకీయ వర్గాల్లో విశేష ఆదరణ పొందుతోంది.
కేటీఆర్ నుంచి ప్రశంసలు దక్కడంపై నటుడు ప్రియదర్శి ఎంతో వినమ్రంగా, భావోద్వేగంతో స్పందించారు. ‘పెళ్లిచూపులు’ చిత్రం నాటి నుంచే తన ప్రతి అడుగును, ప్రతి చిత్రాన్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు కేటీఆర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. “పెళ్లిచూపులు నుండి ప్యారడైజ్ వరకు మీరు నా సినిమాల పట్ల చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను రామన్నా” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రియదర్శి పోస్ట్ చేసిన రిప్లై నెటిజన్ల మనసులను ఆకట్టుకుంటోంది.
మరోవైపు, చిత్రంలో ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన రాజకీయ చర్చ నడుస్తోంది. ఈ పాత్ర ఆహార్యం, హావభావాలు, మాట్లాడే తీరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పోలి ఉన్నాయంటూ నెటిజన్లు పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది పూర్తిగా కల్పిత కథతో రూపొందించిన పాత్ర అని చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ, స్వయంగా కేటీఆర్ ఈ పాత్రను మెచ్చుకోవడం ‘ప్యారడైజ్’ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని, బజ్ను రెట్టింపు చేసింది.









