ఇది నార్త్ వర్సెస్ సౌత్ కాదు.. గుజరాత్ వర్సెస్ దేశం: ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం ఉత్తరాది వర్సెస్ దక్షిణాది కాదని, అది ‘గుజరాత్ వర్సెస్ దేశం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా అసోంకు చెందిన ‘ప్రతిదిన్’ మీడియా నెట్‌వర్క్ నిర్వహించిన “ది కాంక్లేవ్ 2026” సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని, రాష్ట్రానికి అత్యంత కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్ట్ టెండర్లను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులతో పాటు దేశంలోని నిధులన్నింటినీ గుజరాత్‌కే మళ్లిస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓట్ల తొలగింపు వ్యవహారంపై సీఎం రేవంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలో జనాభా పెరుగుతున్నప్పుడు ఓటర్ల సంఖ్య ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తూ.. 2029 ఎన్నికలను ప్రభావితం చేసేందుకే పేదలు, విపక్ష మద్దతుదారులైన 13 కోట్ల ఓట్లను జాబితా నుంచి కుట్రపూరితంగా తొలగించారని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి సైమన్ కమిషన్ తరహాలో కేంద్రం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని ఆక్షేపిస్తూ, ఈసీ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ‘ఎస్ఐఆర్ గో బ్యాక్’ (SIR Go Back) ఉద్యమం రావాలని పిలుపునిచ్చారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థులపై రెండుసార్లు గెలిచానని, 2014 తర్వాత తెలంగాణలో పోరాటం ప్రధానంగా కేసీఆర్‌కు, తనకు మధ్యే జరిగి అసెంబ్లీ కంటే జైలులోనే ఎక్కువ గడిపానని రేవంత్ తెలిపారు. 2017లో రాహుల్ గాంధీని కలిశాకే ఆయనకున్న దేశ ప్రయోజనాల దృక్పథాన్ని చూసి కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే తిరుగులేని ఆధిపత్యమని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు