హైదరాబాద్‌లోని అమీర్‌పేట గోకుల్ ప్రైడ్ ఓయో లాడ్జ్‌లో జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగరానికి తీసుకొచ్చిన ప్రియుడే ఆమెను కొట్టి చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలానికి చెందిన బేగరి శిరీష (34) నగరంలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తుండగా, తాండూరుకు చెందిన పాత నేరస్థుడు అవుసలపల్లి శ్రీనివాస్ (38)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2016లోనే భర్తతో విడాకులు తీసుకున్న శిరీషను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శ్రీనివాస్.. ఈ నెల 24న ఆమెతో కలిసి లాడ్జ్‌కు వచ్చి గణేశ్, దుర్గ అనే పేర్లతో కూడిన నకిలీ ఆధార్ కార్డులను సమర్పించి రూమ్ నంబర్ 103ను అద్దెకు తీసుకున్నాడు.
లాడ్జ్‌లో బస చేసిన సమయంలో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాస్ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గదికి తాళం వేసి బయటకు వచ్చి, రిసెప్షన్లో లాడ్జ్ బిల్లు మొత్తం చెల్లించాడు. గదిలో ఉన్న శిరీష ఉదయం 9 గంటలకు ఖాళీ చేసి వెళ్తుందని సిబ్బందికి చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం ఎంతసేపటికీ గది తలుపులు తెరచుకోకపోవడంతో అనుమానించిన సిబ్బంది వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డూప్లికేట్ కీతో గది తలుపులు తెరిచి చూడగా, మంచంపై శిరీష విగతజీవిగా పడి ఉంది. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. హత్య అనంతరం తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు శ్రీనివాస్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.









