నేడు ఫస్ట్ టైం సిరిసిల్లలో పర్యటించబోతున్న సీఎం రేవంత్: కేటీఆర్ అడ్డాలో రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! 

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా పర్యటిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పలుమార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గానికి రావడం ఇదే ప్రథమం. పర్యటనలో భాగంగా సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తా నుంచి దాదాపు 4 కిలోమీటర్ల మేర భారీ కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం రగుడు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.

ఈ పర్యటన సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా మొత్తం రూ. 345.78 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సరికొత్త ‘నేతన్న బజార్’ ఏర్పాటుతో పాటు మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్ల మంజూరుకు సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కావడంతో కేటీఆర్ ‘అడ్డా’లో సీఎం రేవంత్ రెడ్డి చేయబోయే రాజకీయ ప్రసంగంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటన కొనసాగుతున్న రోజే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కేరళలోని కొచ్చి పర్యటనకు వెళ్లడం గమనార్హం. అక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే కాన్‌‌క్లేవ్’ సదస్సులో కేటీఆర్ ముఖ్య వక్తగా ప్రసంగించనుండటంతో, ఇరు పార్టీల నేతల మధ్య సాగే మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు