హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘తెల్లకాగితం’ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని తనదైన శైలిలో చేసిన ప్రసంగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేదికపై దర్శకుడు రమేష్ పడ్డ కష్టాలను ప్రస్తావిస్తూ.. ఎదుటివారి విమర్శలను పట్టించుకుంటే జీవితంలో ఎదగలేమని, తన గురించి రోజూ రకరకాలుగా రాస్తుంటారని, ఆ మాటలకు తాను బాధపడి ఉంటే ఇప్పటికి 500 సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేదని బండ్లన్న కుండబద్దలు కొట్టారు. పక్కవాడు ఏడిస్తేనే లైఫ్‌లో కిక్ ఉంటుందని, లక్ష్యం పైనే గురిపెట్టి ముందుకు సాగాలని చిత్ర దర్శకుడికి హితబోధ చేశారు.
తన చిరకాల మిత్రుడు, చిత్ర నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గత రెండున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అందరికీ ఎంతో సేవ చేసిన వ్యక్తి కృష్ణ అని, ఆయన జీవితం వైకుంఠపాళిలా నిచ్చెన ఎక్కడం, కింద పడటంతోనే సాగిందని గుర్తుచేసుకున్నారు. వ్యాపారాన్ని, కుటుంబాన్ని కూడా పక్కనపెట్టి సినిమా కోసం సర్వస్వం ధారపోసిన వ్యక్తి అని.. టైటిల్‌కు తగ్గట్లే ఆయన మనసు కూడా తెల్ల కాగితం లాంటిదని చెప్పారు. ఇండస్ట్రీలో ఎందరికో నిస్వార్థంగా సేవలందించిన కృష్ణకు ఈ ‘తెల్లకాగితం’ సినిమా ద్వారా ఊహించని విజయం, ఆర్థిక లాభం రావాలని, ఈసారి ఆయన నేరుగా పెద్ద నిచ్చెన ఎక్కి తిరుగులేని గోల్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నారు. తాను తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు దేవుడు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి రూపంలో వచ్చి తన జీవితాన్ని నిలబెట్టారని.. అలాగే కృష్ణ జీవితాన్ని మార్చడానికే భగవంతుడు ఈ ‘తెల్లకాగితం’ సినిమాను పంపించాడని పేర్కొన్నారు. నిజాయితీగా కష్టపడే ఇలాంటి నిర్మాతలు పరిశ్రమలో నిలదొక్కుకోవాలని, అక్టోబర్ 2న ఎన్ని సినిమాలు విడుదలైనా ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధించి కృష్ణ మరిన్ని సినిమాలు నిర్మించే స్థాయికి చేరాలని కోరుకుంటూ బండ్ల గణేష్ చేతులెత్తి ప్రేక్షకులను వేడుకున్నారు.









