“బొగ్గు, నీళ్లు, భూమి మనవి.. కరెంట్ రాజస్థాన్‌కా?”: రాజస్థాన్‌తో విద్యుత్ ఒప్పందం తక్షణమే రద్దు చేయాలంటూ సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ!

సింగరేణి సంస్థ నుంచి రాజస్థాన్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో విద్యుత్ రంగ నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చౌక విద్యుత్‌ను స్థానిక అవసరాలకు కాకుండా ఇతర రాష్ట్రాలకు కట్టబెట్టడం తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు.

మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో భాగంగా ఉత్పత్తి కానున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు చెందిన సంస్థకు కేటాయించడాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ పవర్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సింగరేణి గనుల నుంచి, నీరు గోదావరి నది నుంచి సేకరిస్తున్నారని, చివరికి ప్లాంట్ ఉన్న భూమి కూడా తెలంగాణదేనని ఆయన గుర్తుచేశారు. సర్వస్వం తెలంగాణకు చెందిన సహజ వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఇక్కడి అవసరాలకు వినియోగించకుండా వేరే రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారంటూ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు.

రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కోతలు, లో-ఓల్టేజీ సమస్యలతో అన్నదాతల పంటలు నిలువునా ఎండిపోతున్న దుస్థితి నెలకొందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, నేడు కనీసం 7 నుంచి 8 గంటలు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. స్థానిక రైతులు, సామాన్య ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి కుదుర్చుకున్న ఈ విద్యుత్ కేటాయింపు ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసి, ఆ విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకే వినియోగించాలని లేఖలో స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు