వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు జాతీయ, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొచ్చిలో నిర్వహించిన ‘ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2026’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాల పునాదుల నుంచి ఎదిగి వేర్వేరు కారణాలతో పార్టీని వీడిన వైఎస్ జగన్, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి సీనియర్ నేతలంతా తిరిగి సొంత గూటికి చేరాలని బహిరంగంగా ఆహ్వానించారు. వారంతా కాంగ్రెస్లోకి పునరాగమనం చేస్తే పార్టీ బలోపేతం కావడంతో పాటు అందరికంటే తానే అత్యంత సంతోషిస్తానని స్పష్టం చేశారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి తాను పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. పార్టీని వీడిన పాత నేతలంతా ఏకతాటిపైకి వస్తే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడటంలో కీలక మలుపు అవుతుందని భట్టి పేర్కొన్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డితో తనకు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. నాయకులను కులాల కోణంలో చూడటం సరికాదని, రేవంత్, తాను పూర్తి సమన్వయం, సమష్టి నాయకత్వంతో ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతున్నామని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న గ్యారెంటీ పథకాలు ఉచితాలు కావని, పేద ప్రజల కొనుగోలు శక్తిని పెంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే సంక్షేమ అస్త్రాలని గట్టిగా సమర్థించుకున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్పై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించే ప్రతి రూపాయికి బదులుగా తిరిగి రాష్ట్రానికి కేవలం 43 పైసలు మాత్రమే దక్కుతోందని, దక్షిణాది రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఆరోపించారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా లేదని, బీజేపీకి అనుకూలంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని భట్టి డిమాండ్ చేశారు.
Post Views: 10









