“ట్రాన్స్‌కో వాటాల విక్రయాన్ని అడ్డుకోండి”: రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ.. రేవంత్ సర్కార్‌పై నిప్పులు!

తెలంగాణ విద్యుత్ సరఫరా వ్యవస్థకు వెన్నెముక లాంటి టీజీ ట్రాన్స్‌కో (TG Transco)లో 26 శాతం వాటాలను ఐపీవో (IPO) ద్వారా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఘాటుగా లేఖ రాశారు. ప్రజాధనంతో నిర్మితమైన విలువైన ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రైవేటీకరణ ఆలోచనలకు ఇది తొలి అడుగు అని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది కిలోమీటర్ల హై-వోల్టేజ్ లైన్లు, కీలక సబ్‌స్టేషన్లతో ప్రజల ఆస్తిగా ఉన్న ట్రాన్స్‌కో వాటాల ఉపసంహరణ నిర్ణయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్ర సర్కార్‌ను నిలువరించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానాలు, 2019 ఎన్నికల మేనిఫెస్టోతో పాటు 2023 రాయ్‌‌పూర్ ప్లీనరీ తీర్మానాలకు పూర్తి విరుద్ధమని హరీశ్ రావు తన లేఖలో ఎండగట్టారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతామని, వ్యూహాత్మకంగా ప్రాధాన్యత లేని నష్టాల్లో ఉన్న సంస్థల్లో మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని గతంలో కాంగ్రెస్ పార్టీ విధానపరమైన ప్రకటనలు చేసిందని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీ (LIC) వంటి ప్రతిష్టాత్మక సంస్థల వాటాలను ప్రైవేటీకరిస్తుంటే జాతీయ స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో తమ సొంత పార్టీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీస్తూ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని తూర్పారబట్టారు.

ట్రాన్స్‌కోలో ప్రైవేట్ వాటాలకు అనుమతిస్తే రాబోయే రోజుల్లో టీజీ జెన్‌కో (TG Genco), సింగరేణి, డిస్కంల ప్రైవేటీకరణకు కూడా దారులు తెరిచినట్లే అవుతుందని హరీశ్ రావు హెచ్చరించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్య హక్కులు ఎప్పటికీ ప్రజల చేతుల్లోనే ఉండాలని, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వివాదంపై స్పందించిన టీజీ ట్రాన్స్‌కో ఉన్నతాధికార వర్గాలు.. వాటాల విక్రయం, ప్రైవేటీకరణ లేదా పబ్లిక్ ఇష్యూ (IPO)పై సంస్థాగతంగా ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు