“వెలుగులోకి ఫ్లైదుబాయ్ నిందితుడి బ్యాక్‌గ్రౌండ్”: తీవ్రవాద ముద్రతో ఒమన్ ఎయిర్ తొలగించినా ఫ్లైదుబాయ్‌లో జాబ్.. భద్రతా వైఫల్యంపై తీవ్ర దుమారం!

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కాక్‌పిట్ లోపల గొడ్డలితో దాడికి పాల్పడిన ఒమన్ దేశస్థుడైన కో-పైలట్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని ఒమన్‌కు చెందిన ‘హమామ్ అల్-హమ్మమీ’గా గుర్తించినట్లు అరబ్ మీడియా కథనాలు సంచలన వివరాలను వెల్లడించాయి. ఇతడు సుదీర్ఘకాలంగా ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి తీవ్రంగా ప్రభావితమయ్యాడని, వివిధ రాడికల్ వెబ్‌సైట్లను తరచూ సందర్శిస్తూ నెట్టింట సంబంధాలు కొనసాగించేవాడని దర్యాప్తులో తేలింది. నిందితుడి తల్లి సిరియా దేశానికి చెందిన మహిళ కావడంతో, ఆమె ద్వారా సిరియాలోని తీవ్రవాద ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

తీవ్రవాద మొగ్గు, అనుమానాస్పద ప్రవర్తన కారణంగానే 2024–2025 మధ్యకాలంలోనే ఒమన్ ఎయిర్‌లైన్స్ (Oman Air) యాజమాన్యం ఇతడిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి తొలగించినట్లు అరబ్ మీడియా స్పష్టం చేసింది. భద్రతా కారణాలతో ఒక జాతీయ విమానయాన సంస్థ ఉద్యోగం నుంచి బహిష్కరించినప్పటికీ.. ప్రసిద్ధ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్ (Flydubai) కనీస బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (నేపథ్య పరిశీలన) కూడా నిర్వహించకుండానే అతడిని నేరుగా కో-పైలట్‌గా ఎలా విధుల్లోకి తీసుకుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విమానయాన రంగంలో అత్యున్నత భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి, డిస్మిస్ అయిన తీవ్రవాద నేపథ్యం ఉన్న వ్యక్తి చేతికి 174 మంది ప్రాణాలున్న విమానాన్ని అప్పగించడం క్షమించరాని నేరమని అంతర్జాతీయ ఏవియేషన్ నిపుణులు మండిపడుతున్నారు. ఫ్లైదుబాయ్ సంస్థ ఘోర నిర్లక్ష్యం వల్లే భారత పైలట్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాల్సి వచ్చిందని, అంతర్జాతీయ నిఘా వైఫల్యాలు కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భద్రతా లోపాలపై అంతర్జాతీయ విమానయాన భద్రతా సంస్థలతో పాటు నిఘా వర్గాలు అత్యున్నత స్థాయి సమగ్ర విచారణ చేపట్టాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు