దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దిశగా నెక్స్ట్-జనరేషన్ జీఎస్టీ (GST) సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 7న జరగనున్న కీలక జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిబంధనలను భారీగా సడలిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో అత్యంత ప్రధానంగా సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం జీఎస్టీ అధికారులకు ప్రస్తుతం ఉన్న ఏకపక్ష స్వతంత్ర అరెస్ట్ అధికారాలను రద్దు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇకపై పన్ను ఎగవేతదారులను అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా న్యాయస్థానం అనుమతి తప్పనిసరి కానుంది. అరెస్టులు, తీవ్ర ఒత్తిళ్ల కంటే బకాయి పన్నులు, వడ్డీ, జరిమానాల వసూలుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
వ్యాపారులపై వేధింపులను అరికట్టేందుకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ పరిమితుల్లో ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఇప్పటివరకు ఉన్న కనీస పన్ను ఎగవేత పరిమితిని రూ. 1 కోటి నుంచి ఏకంగా రూ. 5 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల రూ. 5 కోట్ల లోపు విలువైన పన్ను వివాదాలన్నీ క్రిమినల్ పరిధిలోకి వెళ్లకుండా కేవలం సివిల్ ప్రక్రియలోనే జరిమానాల ద్వారా పరిష్కారం కానున్నాయి. అంతేకాకుండా వస్తువుల వర్గీకరణ, సేవల విలువ నిర్ధారణ లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) అర్హతలపై వ్యాపారులు, పన్ను అధికారుల మధ్య వచ్చే సాధారణ అభిప్రాయ భేదాలను క్రిమినల్ నేరాల జాబితా నుంచి పూర్తిగా మినహాయించనున్నారు.
ప్రాసిక్యూషన్ నిబంధనల సరళీకరణలో భాగంగా చట్టంలోని మొత్తం 24 ప్రాసిక్యూషన్ నేరాల్లో 9 నేరాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. చిన్నపాటి నేరాలకు తప్పనిసరి కనీస జైలు శిక్ష విధించే నిబంధనలను సడలించి, కేవలం ఆర్థిక జరిమానాలతో సరిపెట్టే వెసులుబాటును కోర్టులకు కల్పించనున్నారు. మధ్యస్థాయి ఉల్లంఘనలకు గరిష్ట శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించనున్నారు. ప్రస్తుతం ఇన్వాయిస్ ఆధారిత ఆధునిక డిజిటల్ డేటా మ్యాచింగ్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో.. నకిలీ క్లెయిమ్లను తొలినాళ్లలోనే గుర్తిస్తున్నామని, భౌతిక అరెస్టుల కంటే డిజిటల్ నిఘా ద్వారానే పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.









