అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ శంకుస్థాపన సభపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన ట్వీట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఘాటు కౌంటర్ ఇచ్చారు. “జైరాం.. నమ్మలేకపోతున్నాను, మీరింత తొందరపడతారని నేను అనుకోలేదు” అంటూ విమర్శలు గుప్పించారు. సభలో కనిపించింది ప్రజల ఉత్సాహమే తప్ప ఎలాంటి ప్రజాగ్రహం కాదని, ఓ చిన్న విషయాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం తగదని ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వివాదానికి దారితీసిన ఘటన వివరాల్లోకి వెళితే.. మదనపల్లె సభలో నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తున్న సమయంలో సభికుల మధ్య ఉన్న కొందరు యువకులు తమ అభిమాన నాయకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను చూడాలనే ఉత్సాహంతో పెద్ద పెట్టున కేకలు వేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే మైక్ తీసుకుని జోక్యం చేసుకుంటూ.. కార్యక్రమం పూర్తయ్యాక మీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడతారని చెప్పి వారిని శాంతింపజేశారు. అయితే, ఈ వీడియోను ఉపయోగించి ‘మొదట ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం జోడించగా, దాన్ని జైరాం రమేశ్ రీట్వీట్ చేస్తూ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందంటూ వ్యాఖ్యానించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన పోస్టు ఆధారంగా జైరాం రమేశ్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా ఖండించారు. సభలో పాల్గొన్న టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ నాయకుల పట్ల ప్రదర్శించిన అభిమానం, ఉత్సాహాన్ని.. నిరుద్యోగ నిరసనగా వక్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు. ఏపీలో జరిగిన ఒక స్థానిక అభివృద్ధి కార్యక్రమం చుట్టూ జాతీయ స్థాయిలో రాజకీయ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం రాజుకుంది.









