“మనం ఇప్పటికైనా మారొచ్చు”: సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలపై సమంత ఘాటు పోస్ట్.. నెట్టింట వైరల్!

సమాజంలో మహిళల పట్ల వేళ్లూనుకుపోయిన ద్వంద్వ నీతిని, పక్షపాత ఆలోచనా ధోరణిని సూటిగా ప్రశ్నిస్తూ ప్రముఖ సినీ నటి సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ సందేశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “మనం ఇప్పటికైనా మారొచ్చు” (We can still change) అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌తో ఆమె ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. సమాజం తప్పు చేసే వారిని వదిలేసి, బాధితులనే ఎలా దోషులుగా చిత్రీకరిస్తోందో ఎత్తిచూపుతూ సమంత పెట్టిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.

సమంత పంచుకున్న ఆ పోస్ట్‌లోని పదునైన వాక్యాలు సమాజపు ఆలోచనా తీరును నేరుగా నిలదీశాయి. వేశ్యలను సమాజం నిందిస్తుందని, కానీ వారి వద్దకు వెళ్లే కస్టమర్లను ఎవరూ ప్రశ్నించరని పేర్కొన్నారు. అలాగే కుటుంబ భారాన్ని మోసే ఒంటరి తల్లులను వేలెత్తి చూపిస్తూ, బాధ్యతను విస్మరించిన తండ్రులను ఏమీ అనరని చురకలంటించారు. లైంగిక దాడికి గురైన బాధితురాలి నడవడికపైనే సమాజం ప్రశ్నల వర్షం కురిపిస్తుందని, ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితుడి విషయంలో మాత్రం వింత మౌనం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాన్ని కప్పిపుచ్చే వారిని వదిలేసి, ధైర్యంగా గళమెత్తిన వారిపైనే నిందలు వేసే తీరు మారాలని పిలుపునిచ్చారు.

కేవలం వెండితెర గ్లామర్‌కే పరిమితం కాకుండా మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యం, సామాజిక సమానత్వం వంటి కీలక అంశాలపై సమంత నిరంతరం తన స్వరాన్ని బలంగా వినిపిస్తూ వస్తున్నారు. సమాజంలోని కఠిన వాస్తవాలను, మూస పద్ధతులను ధైర్యంగా ఎండగట్టిన సమంత తీరుపై నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహిళల పట్ల ఉన్న ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలపై నిర్భయంగా స్పందించిన ఆమెను ప్రశంసిస్తూ వేలాది మంది అభిమానులు, నెటిజన్లు కామెంట్ల రూపంలో మద్దతు తెలుపుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు