తెలంగాణలో కొనసాగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో బోగస్ ఫారం-7 పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. నిబంధనల ప్రకారం ఓటరు మరణించినా, ఇతర ప్రాంతానికి శాశ్వతంగా మారినా వారి పేరును తొలగించేందుకు ఫారం-7 సమర్పించాల్సి ఉంటుంది. అయితే ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 210వ పోలింగ్ కేంద్రంలో 31 మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు నకిలీ పత్రాలు సిద్ధం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో బూత్ లెవల్ ఏజెంట్ (BLA) బాలచందర్ బోగస్ ఫారం-7 పత్రాలను సమర్పించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముషీరాబాద్ ఈఆర్‌వో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనున్నారు.
మరోవైపు బోగస్ ఫారం-7 పత్రాల వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. బీఎల్‌ఏలకు బీజేపీ నుంచే నకిలీ పత్రాలు అందించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై అధికారికంగా మరింత సమాచారం వెలువడాల్సి ఉండగా, పోలీసులు చేపట్టనున్న విచారణలో అసలు విషయం తేలనుంది.









