“నరేంద్ర మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపు”: భారత్-ఆస్ట్రేలియా అండర్-19 మ్యాచ్ వేళ కలకలం.. ఖలిస్థాన్ పేరిట ఈ-మెయిల్ వదంతులు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత నరేంద్ర మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. భారత్ అండర్-19 మరియు ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుధవారం ఉదయం 10:52 గంటలకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) అధికారిక మెయిల్‌కు ఈ హెచ్చరిక అందింది. వెంటనే అప్రమత్తమైన క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పోలీసులకు సమాచారం అందించగా.. ఉదయం 11:15 గంటలకు మ్యాచ్ పూర్తయిన వెంటనే ఆటగాళ్లు, సిబ్బందిని సురక్షితంగా స్టేడియం నుంచి తరలించారు.

ఈ బెదిరింపు ఈ-మెయిల్‌లో నవంబర్ 21న స్టేడియంలో జరగనున్న ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీని ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తాము ఖలిస్థాన్ అనుకూల సంస్థకు చెందినవారమని పేర్కొంటూ, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ తీవ్ర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దిల్జిత్ కచేరీలకు ఎవరూ హాజరు కావద్దని హెచ్చరించడంతో పాటు, నవంబర్ 1న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న ఆయన కార్యక్రమాన్ని సైతం ఈ-మెయిల్‌లో ప్రస్తావించి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్క్వాడ్‌లతో రంగంలోకి దిగిన పోలీసులు స్టేడియం పరిసరాల్లో అణువణువూ గాలించారు. ఈ క్రమంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది కేవలం ఆకతాయిల వదంతులేనని తేల్చి అంతా ఊపిరి పీల్చుకున్నారు. నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు నగరంలోని పలు పాఠశాలలు, ఇతర సంస్థలు కలిపి మొత్తం 13 ప్రాంతాలకు ఒకే తరహా ఈ-మెయిల్స్ వచ్చాయని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ హార్దిక్ మకాడియా స్పష్టం చేస్తూ, ఈ మెయిల్స్ పంపిన మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు