తెలంగాణలో కృష్ణా జలాల వినియోగం, డిండి ప్రాజెక్టు, ఎక్సైజ్ ఆదాయంపై బీఆర్ఎస్ సీనియర్ నేత టి. హరీశ్‌రావు చేసిన తీవ్ర విమర్శలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గట్టి కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలం జలాలను బీర్ల తయారీకి కేటాయిస్తున్నామంటూ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, విమర్శలు గుప్పించే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా తెలుసుకునే సంస్కారం ఉండాలని హితవు పలికారు. రవీంద్రభారతిలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడిన జూపల్లి.. బీర్ల ఉత్పత్తికి శ్రీశైలం నీటిని వినియోగిస్తామని తాను ఎక్కడా అనలేదని, తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
డిండి ప్రాజెక్టును సత్వరం నింపి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలనేదే తన అసలు ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా, శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచే నేరుగా డిండి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తే రాష్ట్రానికి అపార ప్రయోజనం చేకూరుతుందని ప్రతిపాదించినట్లు వివరించారు. ఏదుల నుంచి డిండికి తరలించే క్రమంలో ఎదురయ్యే క్షేత్రస్థాయి సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై సమగ్ర పరిశీలన జరపాలని సీఎం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే తక్కువ నీటిమట్టం ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం నీటిని తోడేయకుండా గతంలో తానే స్వయంగా కోర్టుకెళ్లి స్టే తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కరెంట్ కోతలు, సాగునీటి ఎద్దడికి ఎల్‌నినో కారణమని చెబుతున్న ప్రభుత్వం.. మద్యం ఉత్పత్తి, అమ్మకాల్లో ఆ ప్రభావాన్ని ఎందుకు చూపడం లేదంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను జూపల్లి తీవ్రంగా తిప్పికొట్టారు. ఎల్‌నినో సహజ వాతావరణ పరిణామమని, దాన్ని మద్యం విక్రయాలతో ముడిపెట్టి మాట్లాడటం హరీశ్‌రావు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణలో మద్యం ఆదాయాన్ని భారీగా పెంచి ఖజానా నింపుకునే సంస్కృతి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విచ్చలవిడిగా మొదలైందని.. గణాంకాలతో సహా అసలు వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు.









