“సింహాచలం ఆలయం నుంచి హైదరాబాద్‌ మింట్‌కు 1,182 కిలోల వెండి”: ఇటుకలుగా కరిగించి గోల్డ్ బాండ్లలోకి.. శ్రీకాళహస్తి తాపడానికి విక్రయించే ఛాన్స్!

విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుంచి భారీ ఎత్తున వెండి నిల్వలను హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ మింట్‌కు తరలించారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలు, వస్తువులను ఇనుప పెట్టెల్లో భద్రపరిచి అధికారికంగా సీల్ వేశారు. మొత్తం 1,182 కిలోల 846 గ్రాముల 370 మిల్లీగ్రాముల బరువున్న ఈ వెండిని పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించగా, ఆలయ ఈవో, డిప్యూటీ ఈవోతో పాటు ఇతర ఉన్నతాధికారులు వెంటే వెళ్లి పర్యవేక్షించారు.

ఇదిలా ఉండగా, తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయ గర్భాలయ గోపుర రజత తాపడం పనుల కోసం దాదాపు 500 కిలోల వెండి అవసరమని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మింట్‌లో కరిగించిన సింహాచలం వెండిని ఎంఎంటీసీ (MMTC) వంటి ప్రభుత్వ అధీకృత సంస్థల ద్వారా నిర్దిష్ట ధరకు నేరుగా శ్రీకాళహస్తి దేవస్థానానికి విక్రయించేలా ఇరు ఆలయాల మధ్య పరస్పర ఒప్పందం చేసుకునే అవకాశాలను దేవాదాయ శాఖ పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు