“విదేశీ విద్యార్థులకు ట్రంప్ యంత్రాంగం భారీ షాక్”: ఓపీటీ ప్రోగ్రామ్‌కు 70 వేల డాలర్ల ఫీజు.. స్టెమ్ ఎక్స్‌టెన్షన్‌కు మరో 30 వేల డాలర్ల బాదుడు!

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చింది. చదువు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులు అమెరికాలోనే ఉంటూ ఉద్యోగానుభవం సంపాదించేందుకు వీలు కల్పించే అత్యంత కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) పిడుగులాంటి ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం ఓపీటీలో చేరాలనుకునే ఒక్కో ఎఫ్-1 (F-1) విద్యార్థి కోసం ఏకంగా 70,000 డాలర్లను (దాదాపు రూ. 60 లక్షలకు పైగా) ఫీజుగా విధించాలని నిర్ణయించింది. అంతేకాకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విద్యార్థులు పొందే 24 నెలల ఎక్స్‌టెన్షన్‌తో పాటు తదుపరి ప్రతి ఓపీటీ పొడిగింపునకు అదనంగా మరో 30,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మొత్తం రుసుమును నేరుగా విద్యార్థులు కాకుండా సంబంధిత యూనివర్సిటీలే చెల్లించేలా నిబంధనలను రూపొందించింది.

అమెరికా వర్క్‌ఫోర్స్‌లోకి చవకైన విదేశీ శ్రామిక శక్తిని దొడ్డిదారిన ప్రవేశపెట్టడాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనను ప్రతిపాదించినట్లు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఓపీటీ వ్యవస్థ అనేది అమెరికన్ ఉద్యోగుల అవకాశాలను దెబ్బతీసే విధంగాను, వ్యవస్థను దుర్వినియోగం చేసేవారికి ప్రోత్సాహకంగాను మారకూడదని డీహెచ్ఎస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదిత నిబంధనను ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించి 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) గుర్తించిన మోసాలు, కొన్ని కళాశాలలు-యాజమాన్యాలు కుమ్మక్కై సాగిస్తున్న ‘పే-టు-స్టే’ (డబ్బులు చెల్లించి వీసా నిలుపుకోవడం) వంటి అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికే ఈ ఫీజుల విధానాన్ని తెస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం అర్హులైన ఎఫ్-1 విద్యార్థులకు ఏడాది పాటు ఓపీటీ, స్టెమ్ డిగ్రీ ఉన్నవారికి అదనంగా రెండేళ్ల పొడిగింపు వెసులుబాటు లభిస్తోంది. అయితే కొత్తగా ప్రతిపాదించిన ఈ భారీ ఫీజుల భారం పరోక్షంగా అంతర్జాతీయ విద్యార్థుల ట్యూషన్ ఫీజులపై పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేసి అక్కడ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్‌పై ఈ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు