టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రతిభావంతుడైన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్ ‘టాక్సీవాలా’ (2018) తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. 1854-1878 నాటి బ్రిటిష్ ఇండియా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అయితే తెలంగాణ నేపథ్యం ఉన్న విజయ్ దేవరకొండ.. ఈ చిత్రంలో అచ్చమైన రాయలసీమ మాండలికంలో డైలాగ్స్ చెప్పడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తాజా ఇంటర్వ్యూలో గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాయలసీమ యాసలో విజయ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులపై కచ్చితంగా బలమైన ముద్ర వేస్తాయని దర్శకుడు స్పష్టం చేశారు. “డబ్బింగ్ స్టూడియోలో విజయ్ పనితీరు చూసి నేను ఆశ్చర్యపోయాను.. అక్కడ అతను ఒక పిచ్చివాడిలా మారిపోయాడు. ప్రతి డైలాగ్‌ను పదే పదే చెక్ చేసుకుంటూ, మరింత బెటర్‌గా వచ్చేంత వరకు శ్రమించాడు. పైకి ఎంతో కూల్‌గా, చిల్ గైలా కనిపించే విజయ్ లోపల ఇంతటి కసి, నటనపై ఇంత పిచ్చి ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. అతనొక అద్భుతమైన నటుడు.. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేయగల సత్తా అతనికి ఉంది” అంటూ రాహుల్ కొనియాడారు.
ఇది సాధారణ సినిమా కాదని, నాటి పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే డీప్ పీరియడ్ రాయలసీమ ప్రాజెక్ట్ కావడంతో స్లాంగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు రాహుల్ వివరించారు. ‘రణబాలి’లోని శింగనమల బొబ్బిలి పాత్రకు విజయ్ బాడీ లాంగ్వేజ్, కటౌట్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా సరిపోతాయని తాము మొదటి రోజే నిర్ణయించుకున్నామని తెలిపారు. రాయలసీమ యాస కోసం ప్రత్యేకంగా ట్యూటర్లను పెట్టుకుని ముందే వాయిస్ టెస్టులు చేశామని.. అంతేకాకుండా విజయ్ చిన్నతనంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుకోవడంతో అనంతపురం ప్రాంతపు యాస, ఉచ్ఛారణలపై ఆయనకు సహజంగానే పూర్తి పట్టు ఉందని దర్శకుడు తేల్చిచెప్పారు.









