ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన సూచన చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడానికి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకే నేరుగా అందేలా చూసేందుకు ప్రతి ఒక్కరూ తమ రేషన్ కార్డుకు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం (లింక్) చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. గతంలో పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా సేవలు మరింత విస్తృతం అవుతున్న నేపథ్యంలో, ఇంకా మొబైల్ నంబర్ నమోదు చేసుకోని వినియోగదారులు వెంటనే దగ్గరలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.
దీంతోపాటు రేషన్ కార్డులలో నమోదైన కుటుంబ సభ్యులందరికీ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది లబ్ధిదారులకు ఈ-కేవైసీ పూర్తవగా, మిగిలిన వారు కూడా తక్షణమే బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా 5 సంవత్సరాల వయస్సు పైబడిన పిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ ఈ-కేవైసీ నిబంధన వర్తిస్తుందని, ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే సరుకుల పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8:00 నుంచి 12:00 వరకు, సాయంత్రం 4:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకు సెలవు రోజుల్లోనూ రేషన్ షాపుల ద్వారా సరుకులను పంపిణీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇంటివద్దకే రేషన్ అందిస్తుండగా.. పెరిగిన నిత్యావసరాల ధరల దృష్ట్యా రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై బియ్యం, ఉల్లిపాయలు, త్వరలో పామాయిల్, కందిపప్పును కూడా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారులు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ప్రయోజనాలను పొందాలంటే మొబైల్ లింకింగ్, ఈ-కేవైసీని వెంటనే పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.









