తెలుగు సాహితీ లోకంలో చారిత్రక నవలా చక్రవర్తిగా విశేష ఖ్యాతి గడించిన ప్రముఖ సాహితీవేత్త, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ (86) కన్నుమూశారు. గత ఆరు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 8:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సాహితీ ప్రియులు, రచయితలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి సంతాపం ప్రకటించారు.
ముదిగొండ శివప్రసాద్ 1940లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆకుల అల్లూరు గ్రామంలో జన్మించినప్పటికీ, ఆయన విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, సాహితీ వ్యాసంగం మొత్తం హైదరాబాద్‌లోనే సాగాయి. బాల్యంలో ఎంవీఎస్ శర్మ, రామనాథశాస్త్రి వంటి ఉద్దండుల వద్ద విద్యాభ్యాసం చేసిన ఆయన.. 1959లో సికింద్రాబాద్‌లోని వెస్లీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా వృత్తిజీవితం ప్రారంభించారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. అలా ఆయన పుట్టినిల్లు ఆంధ్ర అయినప్పటికీ, జీవితమంతా తెలంగాణలోనే గడిపి ‘గిట్టినిల్లు తెలంగాణ’గా మార్చుకున్నారు.
తెలుగు చారిత్రక నవలా ప్రక్రియకు శివప్రసాద్ నూతన వైభవాన్ని తీసుకొచ్చారు. తన జీవితకాలంలో 80కి పైగా విలువైన గ్రంథాలను రచించగా, వాటిలో 20కి పైగా ఉన్నత ప్రమాణాలు కలిగిన చారిత్రక నవలలే కావడం విశేషం. ఆయన కలం నుంచి జాలువారిన ‘పట్టాభి’, ‘ఆవాహన’, ‘శ్రీపదార్చన’, ‘రెసిడెన్సీ’, ‘శ్రావణి’, ‘శ్రీలేఖ’, ‘వంశధార’, ‘తంజావూరు’, ‘పుష్యమిత్ర’, ‘గంగ నుంచి గంగ వరకు’ వంటి రచనలు పాఠకలోకాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పద్యానికీ, పరిశోధనకూ పెద్దపీట వేసిన ఈ అక్షర యోధుడి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సాహితీవేత్తల సమక్షంలో అధికారికంగా జరగనున్నాయి.









