ఎలాన్ మస్క్‌కు అమెరికా అత్యున్నత సైన్స్ మెడల్: ‘ఆధునిక థామస్ ఎడిసన్’ అంటూ కొనియాడిన ట్రంప్.. తీవ్ర విభేదాల తర్వాత మళ్లీ ఒక్కటైన అగ్ర ద్వయం!

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ (యూఎస్ సైన్స్ మెడల్) పురస్కారంతో ఘనంగా సత్కరించారు. వాషింగ్టన్ పీస్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన ‘సైన్స్: ఎ న్యూ గోల్డెన్ ఏజ్’ కార్యక్రమంలో ట్రంప్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మస్క్‌ను ‘ఆధునిక థామస్ ఎడిసన్’గా అభివర్ణించిన ట్రంప్, ఆయనను అమెరికా జాతీయ సంపదగా ప్రశంసించారు. ఎలాన్ తన ప్రియ మిత్రుడని, అందరికంటే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి అంటూ కొనియాడారు. మస్క్‌తో పాటు గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గే బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, ఏఎండీ చీఫ్ లిసా సూ సైన్స్ మెడల్ అందుకోగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, మైఖేల్ డెల్‌లకు ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ పురస్కారాలు లభించాయి.

గతంలో ట్రంప్, మస్క్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ నుంచి మస్క్ వైదొలగిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం, ఏకంగా మస్క్‌ను అమెరికా నుంచి బహిష్కరిస్తానని ట్రంప్ హెచ్చరించడంతో వీరి వైరానికి సంబంధించిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అవార్డు ప్రదానోత్సవ వేదికపై ట్రంప్ ప్రశంసలు కురిపించినప్పటికీ, ఈ కార్యక్రమం ఆద్యంతం ఇద్దరూ ఒకరినొకరు నేరుగా కళ్లలోకి చూసుకోకుండా వ్యవహరించడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది.

అయితే గత కొద్దికాలంగా వీరిద్దరి మధ్య రాజకీయ, వ్యాపార సంబంధాలు మళ్లీ వేగంగా మెరుగుపడుతున్నాయి. ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం ట్రంప్ ఇచ్చిన విందుకు మస్క్ హాజరుకావడం, వైట్‌హౌస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తుపై ఇరు నేతలు ప్రత్యేక చర్చలు జరపడం వీరి మధ్య సయోధ్యను స్పష్టం చేశాయి. ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత సైన్స్ పురస్కారాన్ని మస్క్‌కు ప్రదానం చేయడంతో సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో వీరి మైత్రి అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు సరికొత్త దిశానిర్దేశం చేయనుందని రాజకీయ, వ్యాపార విశ్లేషకులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు